ఈటలపై తీవ్రంగా విరుచుకుపడ్డ కౌశిక్ రెడ్డి – సీఎం కావాలని మంతనాలు చేశారని ఆరోపణ
హైదరాబాద్: సీఎం పదవి కోసమే అప్పట్లో ఈటల రాజేందర్ కొన్ని BRS ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని, అదే సమయంలో ఆయన్ను అవినీతిపై ఎత్తిపొడిచిన కేసీఆర్ పార్టీ నుంచి తప్పించారని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈటలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
“ఈటలకి రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ గారే. ఆయన లేకపోతే ఈటల పేరే ఉండేది కాదు. ఇప్పుడు ఆయనే కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు. ఇదెంత దురదృష్టకరం! సీఎం అయ్యేందుకు అప్పట్లో ఆయన ప్రయత్నాలు చేసినట్లు మాకు బాగా తెలుసు. పార్టీకి ద్రోహం చేసిన ఈటల ఇక నైతికంగా మాట్లాడే హక్కు కోల్పోయాడు. ప్రజల ముందు మోసపూరిత నాయకుడిగా నిలిచాడు” అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
ఇక బీజేపీలో ఉన్నప్పటికీ ఈటల రాజకీయం పూర్తిగా స్వార్థపూరితమేనని ఆయన ఆరోపించారు. “ఈటల పెద్ద చీటర్. రేపు మాపో బీజేపీని కూడా మోసం చేసి వెళ్లిపోతాడు. అలాంటి వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆవిర్భావం నుంచి ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే ఒక్క నిస్వార్థ చర్య కనబడదు. తన స్వప్రయోజనాలకోసం ఏ పార్టీనైనా, ఏ నేతనైనా మోసం చేయగలడు. అలాంటి నేతల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.