International
ఇరాన్ వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు–భారతీయుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం
భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు ఇస్తున్న వీసా-రహిత ప్రవేశ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులు ఇకపై ఇరాన్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇరాన్ వీసా-ఫ్రీ సదుపాయాన్ని నేరపూరిత గుంపులు భారీగా దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులకు తెలిసింది. ఉద్యోగాల పేరుతో మోసపోయిన భారతీయులు వీసా లేకుండానే ఇరాన్‌కి తరలింపబడుతున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత కొంతమంది వ్యక్తులు కిడ్నాప్‌లకు గురవుతూ, పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు పెరుగుతున్నాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు.
ఈ పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఇరాన్ మీదుగా ఇతర దేశాలకు పంపిస్తామని ప్రలోభపెట్టి కొంతమంది భారతీయులను అక్రమ రవాణా చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు ఎంఈఏ తెలిపింది. ఇరాన్‌లో కిడ్నాప్ కేసులు పెరుగుతుండటంతో, భారతీయుల భద్రత కోసం వీసా-ఫ్రీ ప్రవేశాన్ని రద్దు చేయడం తప్పనిసరి చర్యగా మారిందని స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో ఎంఈఏ భారతీయులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌కు వెళ్లే ముందుగా తప్పనిసరిగా వీసా తీసుకోవాలని సూచించింది. వీసా-రహిత ప్రవేశం లేదా మూడవ దేశాలకు పంపుతామని చెప్పే ఏజెంట్లను నమ్మవద్దని తెలిపింది. నకిలీ ఉద్యోగ ఆఫర్లు, మానవ అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం భారతీయుల భద్రత కోసం చాలా ముఖ్యమని అధికారాలు పేర్కొన్నాయి.
![]()
