Telangana
ఇకపై వాట్సాప్‌లోనే మీసేవ సేవలు | ఇంటి నుంచే ధృవీకరణ పత్రాలు & బిల్లులు – పూర్తి వివరాలు
తెలంగాణ ప్రభుత్వము ప్రజలకు పెద్ద శుభవార్త అందించింది. ఇకపై మీసేవ సేవలు నేరుగా వాట్సాప్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లి క్యూల్లో నిలబడే అవసరమే లేకుండా, ఇంటి నుంచే ధృవీకరణ పత్రాలు, బిల్లులు, పన్నుల చెల్లింపులు వంటి కీలక సేవలను పొందవచ్చు. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు చేరువ అవుతాయని అధికారులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, మీసేవలోని సేవలను వాట్సాప్ ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకురావడానికి నిర్ణయించింది. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ వినూత్న సేవను ప్రారంభించనున్నారు. మొదటి దశలో ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు వంటి ప్రధాన సర్టిఫికెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తరువాత దశల్లో 400 కంటే ఎక్కువ మీసేవ సేవలను కూడా వాట్సాప్‌లో అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.ఈ సేవ పూర్తిగా ఆధార్ ఆధారిత ధృవీకరణపై పనిచేస్తుంది. వినియోగదారులు ముందుగా అధికారిక మీసేవ వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకుని, “Hi” అని పంపితే అన్ని సేవల మెనూ కనిపిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్‌ను ఎంచుకుని, OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, దరఖాస్తు ఫారమ్‌ను వాట్సాప్‌లోనే పూరించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను కూడా మొబైల్‌లో నుంచే అప్‌లోడ్ చేయడం సాధ్యమే.ఫీజు చెల్లింపు, అప్లికేషన్ స్టేటస్ ట్రాకింగ్, సర్టిఫికెట్ డౌన్‌లోడ్ — అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు, పనిచేసే ఉద్యోగులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మీసేవ సేవలను ఇంటి నుంచే వేగంగా పొందే విధంగా ఈ డిజిటల్ సౌకర్యం తెలంగాణలో పెద్ద మార్పును తీసుకురానుందని నిపుణులు భావిస్తున్నారు.
![]()
