Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు శ్రీకారం…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శారద నవరాత్రి ఉత్సవాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాల పోస్టర్ను ఆలయంలో ఆవిష్కరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసేందుకు కమిటీలు నియమించామని, భద్రత, తాగునీరు, శానిటేషన్, క్యూలైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 29న మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలయానికి విచ్చేసి శ్రీ దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ దసరా పర్వదినాల్లో లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆన్‌లైన్ దర్శన టికెట్లతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు.