Latest Updates
ఆపరేషన్ సిందూర్: డమ్మీ విమానాలతో పాక్‌ను మోసం చేసి బ్రహ్మోస్‌తో దెబ్బకొట్టిన భారత్
ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం (IAF) అసాధారణ వ్యూహంతో పాకిస్థాన్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో IAF పక్కా ప్రణాళికతో ఎరవేసి, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను బలిచేసి, కోలుకోలేని దెబ్బతీసింది. మొదటగా, యుద్ధ విమానాలను తలపించే డమ్మీ (పైలట్‌లెస్) విమానాలను ప్రయోగించింది. ఈ డమ్మీ విమానాలను రాడార్లలో యుద్ధ విమానాలుగా చూపించేలా రూపొందించారు. వీటిని గుర్తించిన పాకిస్థాన్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను, ముఖ్యంగా HQ-9 మిస్సైల్ బ్యాటరీలను యాక్టివేట్ చేసింది. ఈ సమయంలో వాటి లొకేషన్లను భారత్ ఖచ్చితంగా ట్రాక్ చేసింది.
ఈ సమాచారంతో, భారత్ తన అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించింది. మే 9-10 మధ్య రాత్రి జరిగిన ఈ దాడుల్లో దాదాపు 15 బ్రహ్మోస్ మిస్సైళ్లతో పాటు స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, రాంపేజ్ వంటి ఇతర ఖచ్చితమైన మిస్సైళ్లను ఉపయోగించి, పాకిస్థాన్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. నూర్ ఖాన్, రఫీకీ, సుక్కూర్, సర్గోధా వంటి స్థావరాలతో పాటు రాడార్ స్టేషన్లు, కమాండ్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు నాశనమయ్యాయి. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు, ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ విమానం కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌లో బ్రహ్మోస్ మిస్సైళ్లు మొదటిసారి యుద్ధంలో ఉపయోగించబడి, వాటి అసాధారణ సామర్థ్యాన్ని చాటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల తీవ్రతతో పాకిస్థాన్ ప్రతిదాడి ప్రణాళికలను విరమించుకుని, సంధి చర్చలకు అభ్యర్థించినట్లు వార్తలు వెల్లడించాయి.