Business
ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన BCCI
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ఆదాయంలో మరోసారి అద్భుతమైన ఘనతను సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, బోర్డు రూ.9,741.7 కోట్ల రూపాయల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది ఇప్పటివరకు నమోదైన అతి పెద్ద రికార్డు. ఈ వివరాలను ప్రముఖ మీడియా కమ్యూనికేషన్ సంస్థ Rediffusion వెల్లడించింది. BCCI ఆదాయంలో ప్రతి సంవత్సరం అనూహ్యంగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. భారతీయ క్రీడా రంగంలో అంతటి పెద్ద మొత్తంలో ఆదాయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ మొత్తంలో అత్యధికంగా, సుమారు రూ.5,761 కోట్లు అంటే 59 శాతం ఆదాయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచే వచ్చింది. 2007లో ప్రారంభమైన IPL టోర్నమెంట్, నేటికి భారత క్రికెట్‌కు జీవిత రేఖగా మారింది. గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఇది అత్యంత ఆదాయాన్ని తెచ్చిపెట్టే లీగ్‌లలో ఒకటిగా నిలిచింది.
IPL ద్వారా ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్‌లు, బ్రాండ్ డీల్‌లు, బాక్స్ ఆఫీస్ మరియు ఇతర కమర్షియల్ అంగాంశాల ద్వారా వచ్చిన ఆదాయం బోర్డుకు భారం లేకుండా భారీ మూలధనాన్ని తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం BCCI నెట్ వర్త్ అంటే ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.30,000 కోట్లుగా ఉండగా, దానిపై BCCIకి ప్రతి సంవత్సరం రూ.1,000 కోట్లు వడ్డీ ఆదాయంగానే వస్తోందని సమాచారం. అంటే, క్రికెట్ ఆడించకుండానే ఎలాంటి చలనం లేకుండానే వచ్చే ఆదాయం కూడా వేల కోట్లలో ఉన్నదన్నమాట!