Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం: 2024 ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బు వినియోగం?
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం డబ్బులను 2024 ఎన్నికల సమయంలో ఓట్ల కొనుగోలుకు వినియోగించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తులో ఆధారాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ అవినీతి దందా జరిగినట్లు తెలుస్తోంది. సూర్యాపేట వరకు డబ్బుల మూటలను తరలించి, గత ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన ఇద్దరు నాయకులకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నాయకులను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న రూ.8 కోట్ల నగదు కూడా ఈ లిక్కర్ స్కామ్‌లో భాగంగా సేకరించిన డబ్బులేనని సమాచారం. సిట్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తూ, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, రాజకీయ నాయకుల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తోంది. ఈడీ కూడా ఈ కేసుపై సమాంతర దర్యాప్తు చేపడుతోంది. ఈ కుంభకోణం రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ దర్యాప్తు ఫలితాలు ప్రజలలో కలకలం రేపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.