International
అమెరికాలో కుప్పకూలిన F-35 ఫైటర్ జెట్ – పైలట్ సురక్షితం
అమెరికాలో మరోసారి యుద్ధ విమాన ప్రమాదం సంభవించింది. కేలిఫోర్నియాలోని లిమూరే ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో అత్యాధునికంగా రూపొందించబడిన F-35 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మంటలు చెలరేగగా, ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ విమానాన్ని నడుపుతున్న పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం వైమానిక దళ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. F-35 లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్ పటిష్టమైన సాంకేతికతతో పనిచేస్తుందన్నది అందరికీ తెలిసిందే. అలాంటి జెట్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఫ్లైట్ డేటా రికార్డర్‌ను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఇటీవలే ఇలాంటి మరొక ఘటన భారతదేశం కేరళలో చోటు చేసుకుంది. UKకు చెందిన F-35 ఫైటర్ జెట్ తిరువనంతపురంలో తాత్కాలికంగా మొరాయించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు నిర్వహించిన మరమ్మతుల అనంతరం ఆ విమానాన్ని మళ్లీ యునైటెడ్ కింగ్‌డమ్‌కి తరలించారు. వరుసగా F-35కు సంబంధించిన ఇలాంటి ఘటనలు జరగడం అంతర్జాతీయంగా ఆవేశంతో కూడిన చర్చలకు దారి తీస్తోంది.