News
అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో సంచలనం—ల్యాప్‌టాప్ డీఎన్ఏతో అసలు నిందితుడి గుర్తింపు
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఏపీ మహిళ శశికళ నర్రా, ఆమె కుమారుడు అనీష్ సాయి హత్య కేసు ఇప్పుడు భారీ మలుపు తిరిగింది. ఆ సమయంలో అనుమానితుడిగా ఆమె భర్త హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, తరువాత అతడిని నిర్దోషిగా విడుదల చేశారు. తాజాగా డీఎన్‌ఏ ఆధారాలతో అసలు నిందితుడు అతడి సహోద్యోగి హమీద్ అని అధికారులు నిర్ధారించారు. ఈ కొత్త ఆధారాలు కేసు దిశనే మార్చేశాయి.
2017 మార్చి 23న న్యూజెర్సీ రాష్ట్రంలోని మాపుల్ షేడ్ అపార్ట్‌మెంట్‌లో శశికళ, ఆమె కుమారుడు వైద్యం చేయలేని పరిస్థితిలో రక్తపు మడుగులో మృతదేహాలుగా కనిపించడం కుటుంబానికే కాక అమెరికా పోలీసులకు కూడా విషాదాన్ని మిగిల్చింది. ఆ సమయంలో హనుమంతరావుపై భార్య కుటుంబం ఆరోపణలు చేసినా, ఘటనా స్థలంలో లభించిన డీఎన్‌ఏ అతడిదికాదని తేలడంతో అతడు విడుదలయ్యాడు.
దర్యాప్తు సమయంలో హనుమంతరావు సహోద్యోగి హమీద్‌తో విబేధాలు ఉండటం, హత్యల తర్వాత ఆరు నెలల్లో భారత్‌కు తిరిగి రావడం పోలీసులు అనుమానం పెంచింది. అమెరికా అధికారులు పలుమార్లు డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని కోరినా, హమీద్ అంగీకరించకపోవడంతో కేసు నిలిచిపోయింది. దీంతో అమెరికా కోర్టు ఆదేశాల ప్రకారం కాగ్నిజెంట్ సంస్థ అతడు అమెరికాలో పని చేసినప్పుడు ఉపయోగించిన ల్యాప్‌టాప్‌ను అప్పగించింది.
ఆ ల్యాప్‌టాప్ నుండి సేకరించిన డీఎన్‌ఏ నమూనా ఘటనా స్థలంలో ఉన్న డీఎన్‌ఏతో పూర్తిగా మ్యాచ్ కావడంతో, హమీద్‌ను కేసులో ప్రధాన నిందితుడిగా అమెరికా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌లో ఉండే అతని గురించి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. హమీద్ చేతిలో హత్యకు కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా, హనుమంతరావుపై పగ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
![]()
