అమర్నాథ్ సెటైర్లు: “సింగపూర్ ఎందుకు వెళ్లారో కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “సింగపూర్ ఎందుకు వెళ్లారో కూడా చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఆయన గత 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు 58సార్లు సింగపూర్ వెళ్లారు. ఈ పర్యటనల వెనుక ఉద్దేశ్యం ఏంటి? అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడానికే ఈ పర్యటనలు చేస్తున్నారా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
గత 15 నెలల్లో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించినది ఏమి లేదని అమర్నాథ్ ధ్వజమెత్తారు. “ప్రజలకు ఏ ఒక్క మంచి కార్యక్రమం చూపలేని స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం, ఇప్పుడు జగన్ పై విమర్శలు చేయడానికే పరిమితమైంది. అభివృద్ధి పేరిట ప్రజలను మోసం చేస్తోంది. గత ప్రభుత్వ పథకాలను మూసివేసి కొత్తదిగా ప్రచారం చేస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని విలువైన భూములను ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. “వాస్తవంగా చూస్తే, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి కాదు.. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడమే. ప్రజల ఆస్తులు, భవిష్యత్తును ఇలా తాకట్టు వేయడం బాధాకరం” అని వ్యాఖ్యానించారు.