movies
అన్నగారు వస్తారు: కార్తీ కొత్త తెలుగు టైటిల్‌తో వచ్చిన ఆసక్తికర అప్డేట్
తమిళ హీరోల్లో తెలుగులో అత్యధిక మార్కెట్ ఉన్న వారిలో కార్తీ పేరు ముందుంటుంది. కోలీవుడ్ హీరో సూర్య తమ్ముడిగా టాలీవుడ్‌లో పరిచయం అయిన ఆయన, కాలక్రమంలో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్నప్పటికీ, విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకపోవడంతో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మొదట పొంగల్‌కు రిలీజ్ చేయాలని అనుకున్నారు. తరువాత డిసెంబర్ 5కి షెడ్యూల్ చేసినా కూడా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రమోషన్లు మాత్రం వేగంగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. “అడ్వెంచర్ తుఫానుతో ఒక హీరో వస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్ పోస్టర్‌ను మరింత హైలైట్ చేస్తోంది.పాన్ ఇండియా ట్రెండ్‌లో చాలా సినిమాలు అసలు అర్థం రాని పేర్లతో తెలుగులోకి వస్తున్న సమయంలో, కార్తీ మాత్రం తెలుగు నేటివిటీకే దగ్గరగా ఉండే టైటిల్‌ను ఎంచుకోవడం ప్రత్యేకం. ఆయన గతంలో ‘సత్యం సుందరం’ టైటిల్‌తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈసారి కూడా అదే కన్‌నెక్ట్ కోసం ‘అన్నగారు వస్తారు’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో కార్తీ ఎంజీఆర్ ఫ్యాన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తోంది. సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ ప్రమోషనల్ వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘అన్నగారు వస్తారు’గా రానున్న ఈ సినిమా కార్తీకి మరొక విజయాన్ని అందిస్తుందా? విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ హైప్ బాగానే క్రియేట్ అవుతోంది.
![]()
