Andhra Pradesh
అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు.. లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో ఒక్కో రోజూ కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఎస్‌ఐటీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడంతో కేసు కుదుటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సులోచనా ఫామ్ హౌస్‌లో ఎస్‌ఐటీ సోదాలు నిర్వహించగా, అధికారుల కళ్లను చెదిరేంతగా రూ.11 కోట్ల నగదు బయటపడింది. ఇది బియ్యం బస్తాల మధ్య 12 అట్టపెట్టెలో ప్యాక్ చేసి దాచినట్లు గుర్తించారు.
ఈ ఫామ్ హౌస్‌ను అక్రమంగా క్యాష్ డెన్‌గా వినియోగిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తులుగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, చాణక్యల ఆదేశాలతో గతేడాది వరుణ్ సంస్థ ఆఫీస్ ఫైళ్ల పేరిట ఈ నగదు తరలింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నగదు వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఎన్నికల సమయంలో ఇది అక్రమ నిధుల రూపంలో వాడబడిందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఎస్‌ఐటీ, ఇప్పుడు నగదు, ఫామ్ హౌస్ ఆధారాలతో మరిన్ని రాజకీయ నేతలతో పాటు వ్యాపార వర్గాలపైనా విచారణ దృష్టి పెట్టినట్లు సమాచారం. లిక్కర్ కాంట్రాక్టుల కమీషన్ల పేరిట ఈ డబ్బు సమకూరిందా? లేదా వేరే అక్రమ ఆర్థిక వ్యవహారాల్లో భాగమా? అనే అంశాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది.