Andhra Pradesh
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన – రూ.94.44 కోట్లతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రూ.94.44 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం పుష్కరఘాట్ వద్ద కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి దుర్గేశ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీతీర ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ వంతెన, పుష్కరఘాట్, కడియం నర్సరీ, కోట సత్తెమ్మ గుడి వంటి ప్రముఖ ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే నదీ తీరాల్లో బోటింగ్, టెంట్ సిటీ, నిత్య హారతి వంటి పర్యాటక ఆకర్షణల్ని వచ్చే రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పర్యాటక ఆదాయం పెరిగే అవకాశం ఉంది.