News

హయత్‌నగర్–దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఐటీ కారిడార్‌కు కొత్త బస్సు సర్వీసులు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రోజువారీ ప్రయాణ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో ముందడుగు వేసింది. రద్దీ, మార్పిడి ప్రయాణాల వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల కోసం ‘గర్‌లక్ష్మీ ఇన్ఫోబాన్’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించింది. హయత్‌నగర్, ఎల్‌బీ నగర్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు నేరుగా చేరేలా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంతవరకూ మెట్రో, క్యాబ్‌లు మారుతూ కార్యాలయాలకు చేరాల్సిన పరిస్థితి ఉండగా కొత్త ఇన్ఫోబాన్ సర్వీసులతో నేరుగా గమ్యం చేరే అవకాశం ఏర్పడింది. ఉద్యోగుల పనివేళలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఈ బస్సులు నిరంతరంగా నడుస్తాయి.

ఆర్టీసీ ప్రత్యేకంగా రెండు రూట్లు రూపొందించింది. 156/316 రూట్‌ ఎల్‌బీ నగర్ నుంచి ప్రారంభమై కోఠి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, నార్సింగి, కోకాపేట మీదుగా గచ్చిబౌలి చేరుతుంది. మరోవైపు 300/316 రూట్ హయత్‌నగర్ నుంచి ఎల్‌బీ నగర్, సాగర్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, నార్సింగి, కోకాపేట సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వేవ్‌రాక్, విప్రో, ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలికి చేరనుంది. ఈ మార్గాల ద్వారా సుమారు 40 ప్రాంతాలకు నేరుగా కనెక్టివిటీ లభించనుంది.

ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ఉద్యోగులకు తీవ్ర ఒత్తిడిగా మారింది. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో వాహనాల సగటు వేగం 12 నుంచి 15 కిలోమీటర్లకే పరిమితమవుతోంది. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే ఐటీ కారిడార్‌లో 500 బస్సులను ఆర్టీసీ నడుపుతుండగా, వాటిలో 200 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది

క్యాబ్‌లు, ప్రైవేటు గాడీలపై ఆధారపడటం వల్ల అయ్యే అధిక ఖర్చు, మానసిక ఒత్తిడి ఈ కొత్త సేవల ద్వారా గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు తమ వాహనాలను ఇళ్ల వద్దే ఉంచి, సౌకర్యవంతమైన ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని హైదరాబాద్ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ సూచించారు.

#GarlakshmiInfobahn#TGSRTC#HyderabadTransport#HyderabadIT#ITEmployees#ITCorridor#Gachibowli#FinancialDistrict
#PublicTransport#SmartCommute#OfficeCommute#TrafficRelief#ElectricBuses#SustainableTransport#HyderabadNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version