సింగపూర్ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి లోకేశ్
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అక్కడి తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ అభివృద్ధి మోడల్‌ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. “సింగపూర్ అభివృద్ధి చెందిన తీరు చూసి మనం మారాలి. సమర్థవంతమైన పాలన, పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని ఆరోపించిన లోకేశ్, విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆ పరిస్థితిని గమనించి రాష్ట్రాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. “ఏ దేశానికి వెళ్లినా, అక్కడి తెలుగువారినే ముందు కలుస్తున్నాం. వారు తమ ప్రాంతం పట్ల చూపుతున్న ప్రేమ, చిత్తశుద్ధి అభినందనీయమైనది,” అని చెప్పారు. వారి సూచనలు, అభిప్రాయాలు రాష్ట్ర నిర్మాణంలో ఉపయుక్తంగా ఉంటాయని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న తెలుగువారు కీలక పాత్ర పోషించాలన్నారు. “సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న తెలుగువారు తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని కోరుతున్నాం,” అని అన్నారు.