National

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత: లీపా లోయలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన, భారత ఆర్మీ ఘాటైన ప్రతిఘటన

భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైన్యం మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అర్ధరాత్రి లీపా లోయలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపి మోర్టార్ షెల్లింగ్ ప్రారంభించగా, భారత సైన్యం వెంటనే ప్రతిస్పందించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏర్పడిన శాంతిని ఈ చర్య భంగం కలిగించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని వ్యూహాత్మక లీపా లోయ ప్రాంతం పాకిస్తాన్ చొరబాట్లకు కీలక కేంద్రంగా ఉంది. భారత సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం జరిపిన కాల్పులకు భారత జవాన్లు ఘాటుగా బదులిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, భారత ప్రతిఘటనతో పాకిస్తాన్ సైనికులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ ఆపరేషన్‌లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలు పూర్తిగా నాశనం అయ్యాయి. అప్పటినుంచి సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పాక్ మళ్లీ వక్రబుద్ధి చూపించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, లీపా వ్యాలీ ఘటన పాకిస్తాన్ శాంతిని చెదరగొట్టాలనే ప్రయత్నానికి నిదర్శనం. ఇటీవల ఆగస్టులో పూంఛ్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఉల్లంఘనలు జరిగినప్పటికీ, భారత సైన్యం వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. తాజా ఘటనతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగి, రెండు దేశాల మధ్య భద్రతా పరిస్థితులు మళ్లీ సవాలుగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version