Telangana

వారికి శుభవార్త: ఖాతాలో డబ్బులు పడ్డాయి – రెండు సీజన్లకు సంబంధించిన నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ యాదాద్రి జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంటూ, రెండు సీజన్లకు సంబంధించిన పెండింగ్ కమిషన్ నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఐకేపీ, పీఎసీఎస్, ఎఫ్‌పీవోలు వంటి సంఘాల ఖాతాల్లో భారీగా డబ్బులు జమ అయ్యాయి. త్వరలోనే వడ్ల కొనుగోలు సీజన్ ప్రారంభమవ్వడంతో ప్రభుత్వం ఈ బకాయిలను ముందుగానే విడుదల చేసింది.

యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో కీలకపాత్ర పోషించే పలు కేంద్రాలకు 2023–24 ఆర్థిక సంవత్సరం యాసంగి మరియు వానాకాలం సీజన్లకు సంబంధించిన కమిషన్ నిధులు మంజూరు అయ్యాయి. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల ద్వారా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవోలు), ఐకేపీ, పీఎసీఎస్ కమిటీలు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి.

ఇక గతంలో వడ్ల కొనుగోలు కార్యకలాపాల్లో పీఎసీఎస్ కమిటీలు ప్రధాన పాత్ర పోషించగా, ఇప్పుడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఐకేపీ కేంద్రాలు ఆ బాధ్యతను భుజాన వేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరిగే వడ్ల కొనుగోళ్లలో 50 శాతానికి పైగా ఐకేపీ కేంద్రాల ద్వారానే జరుగుతున్నాయి. మిగిలిన వడ్లను మార్కెట్ కమిటీలు, ఎఫ్‌పీవోలు కొనుగోలు చేస్తున్నాయి.

ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసిన కేంద్రాలకు క్వింటాల్‌కు రూ.32 కమిషన్ చెల్లిస్తోంది. 2023–24 వానాకాలం, యాసంగి సీజన్లలో మొత్తం 5.73 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్లకు రూ.18.34 కోట్ల కమిషన్ విడుదల చేయగా, మొదటి విడతలో రూ.12.67 కోట్లు విడుదల చేశారు. తాజాగా మిగతా రూ.5.66 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఆర్థిక ఊతాన్ని ఇవ్వడమే కాకుండా, రైతుల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version