Business
వరంగల్ విమానాశ్రయ భూసేకరణ వేగవంతం
వరంగల్ మామునూరు విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు ఊపందింది. రైతుల భూములకు ప్రభుత్వం ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున పరిహారం అందించింది. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు జమ కాగా, మొత్తం 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది.
అయితే వ్యవసాయేతర భూముల విషయంలో కొంత వివాదం నెలకొంది. ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లకు గజానికి రూ.4 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా, స్థానికులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలకు తగ్గట్లుగా గజానికి కనీసం రూ.12 వేల పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విమానాశ్రయ విస్తరణపై ప్రభుత్వం దూసుకుపోతున్నా, భూసేకరణలో ఈ వివాదం సవాల్‌గా మారింది. పరిహారం విషయంలో ప్రభుత్వం, స్థానికుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇరు వర్గాలకు అనుకూలంగా సమస్య పరిష్కారం కాగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.