News
రాయదుర్గ్ కో-లివింగ్ హాస్టల్స్‌పై పోలీసుల దాడులు.. ఐదుగురు పట్టుబడ్డారు

హైదరాబాద్ మహానగరంలో చదువు, ఉద్యోగాల కోసం నిత్యం వందల సంఖ్యలో యువత తరలివస్తుంటారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు హాస్టల్స్, పీజీల్లో ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో నగరంలో కో-లివింగ్ హాస్టల్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఈ కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఇటీవల హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో ఉన్న పలు కో-లివింగ్ హాస్టల్స్‌లో డ్రగ్స్ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు రాయదుర్గ్‌లోని ‘కో-లివ్ గార్నెట్’ పీజీపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో MDMA డ్రగ్ సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు, ముగ్గురు వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వంశీ దిలీప్, బాలా ప్రకాశ్‌లుగా గుర్తించారు. వినియోగదారులుగా హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రాయదుర్గ్‌తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కో-లివింగ్, పీజీ హాస్టల్స్ కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ హాస్టల్స్‌ను కేంద్రంగా చేసుకుని యువకులు, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. నగరంలోని కో-లివింగ్ సంస్కృతి పెరుగుతున్న కొద్దీ పర్యవేక్షణ లోపాలు అక్రమాలకు దారి తీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కో-లివింగ్, పీజీ హాస్టల్స్ నిర్వహణపై కఠిన నిబంధనలు అవసరమన్న చర్చ కూడా ఈ ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది.
#HyderabadDrugs#CoLivingHostels#Rayadurgam#DrugRacket#MDMADrugs#HyderabadPolice
#YouthTargeted#Gachibowli#Madhapur#HyderabadNews