News
రప్ప.. రప్ప.. ప్లకార్డులతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ డైలాగ్ చర్చనీయాంశంగా మారిపోయింది. సినిమా theatres లో వినిపించిన మాటలు.. ఇప్పుడు రాజకీయ సభల్లో, రోడ్లపై ప్లకార్డుల మీద కనిపిస్తున్నాయి. ఆ డైలాగ్ ఏంటంటే.. ‘రప్ప రప్ప.. 3.0 లోడింగ్’!
తెలంగాణ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో తాజాగా జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమంలో ఇదే డైలాగ్ గిరగిరా తిరిగింది. కార్యకర్తలు చేతుల్లో పట్టిన ప్లకార్డుల్లో ‘2028లో రప్ప రప్ప.. 3.0 లోడింగ్’ అంటూ పెద్ద అక్షరాల్లో రాసి, హరీశ్ రావు ఫొటోలు కూడా వేసి ప్రచారం చేశారు. ఇది చూసినవాళ్లకి ఇదేం కొత్త ప్రచారమా అని ఆశ్చర్యం కలిగింది.
ఇదంతా ఎలా మొదలైంది?
ఈ ప్లకార్డ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి ఇటీవలే జరిగిన మరో సంఘటనతో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో సత్తెనపల్లిలో జరిగిన జగన్ పర్యటనలో ఓ యువకుడు ఇదే డైలాగ్ రాసిన ప్లకార్డ్ పట్టుకుని రావడంతో హల్‌చల్ అయింది. పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అయితే ఈ డైలాగ్ వైరల్ అవుతూ పోతోంది.
ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ తెలంగాణకూ ఎక్స్‌టెండ్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక రాజకీయ సందేశంలా మారింది. ‘2028లో మేమే రప్ప మళ్ళీ.. మళ్ళీ అధికారంలోకి వస్తాం.. హరీశ్ రావుతో 3.0 గవర్నమెంట్ లోడింగ్’ అన్న సంకేతాన్ని ఈ ప్లకార్డ్ లో పెట్టారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీ డైలాగులు మామూలే కానీ, ‘రప్ప రప్ప’ మాత్రం ఇప్పుడు కాస్త డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఎక్కడి సభలో ఎవరు చూపిస్తే అక్కడే కొద్దిగా ఉద్రిక్తతే.. కానీ రాజకీయ పార్టీలకు ఇది ఓ వ్యూహంగా మారుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. పుష్ప సినిమా డైలాగ్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఓ కొత్త స్టోరీ రాసేస్తోంది!