Andhra Pradesh
మద్యం కొనాలంటే ఇవి తప్పనిసరి.. న్యూ ఇయర్ వేళ కొత్త రూల్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం విక్రయ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. నకిలీ మద్యం పూర్తిగా అరికట్టడం, అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం మోపడం లక్ష్యంగా వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మద్యం అమ్మకాల విధానంలో చేసిన మార్పులతో విక్రయాలు పెరిగినట్లు అధికారులు వెల్లడించగా, తాజాగా ప్రతి మద్యం సీసాకు ప్రత్యేక గుర్తింపు నంబర్ కేటాయించే నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి వరకు నకిలీ మద్యం నివారణకు మొబైల్ యాప్, క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి మద్యం సీసాపై ‘లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్’ ముద్రించనున్నారు. మద్యం బ్రాండ్, తయారీ తేదీతో పాటు ప్రత్యేక నంబర్‌ను ప్రతి సీసాపై నమోదు చేయనున్నారు. ఈ నంబర్ ఆధారంగా వినియోగదారులు మద్యం కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం విధానాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు.
లాటరీ విధానంలో షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అమలు, రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని సీఎం సూచించారు. బార్‌లకు సంబంధించిన అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET) మినహాయింపుపై కూడా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి మద్యం బాటిల్‌పై ప్రత్యేక గుర్తింపు నంబర్‌తో పాటు జియో ట్యాగింగ్ ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే షాపుల రేషనలైజేషన్, ట్రాకింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాటిల్ తిరిగి ఇస్తే డిపాజిట్ రిటర్న్స్ స్కీమ్ (DRS) కింద నగదు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఎక్సైజ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, 2024 అక్టోబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.7,041 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం వృద్ధి నమోదైందని, ఐఎంఎఫ్‌ఎల్ విక్రయాలు 19.08 శాతం, బీరు విక్రయాలు 94.93 శాతం పెరిగాయని వెల్లడించారు. డిసెంబర్ 18 నాటికి రూ.8,422 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని, మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధి సాధిస్తామని అధికారులు అంచనా వేస్తున్నారు.
#APGovernment#LiquorPolicy#FakeLiquor#ExciseDepartment#LiquorSales#CBN
#LiquorReforms#DigitalTracking#ExciseRevenue#AndhraPradeshNews