Politics

మంత్రివర్గ విస్తరణపై చర్చలు.. కొత్త నాయకులకు అవకాశం అంటున్న పీసీసీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో క్యాబినెట్ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించారు. అయితే, మంత్రివర్గంలోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగడం తన నిర్ణయం అని స్పష్టం చేశారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉండటమే తనకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న గౌడ్, ఒక రాష్ట్ర మంత్రికి ఉండే అధికారాలకన్నా పార్టీ అధ్యక్షుడికి ఎక్కువ బాధ్యత, ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రారంభ దశలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తనను మంత్రివర్గంలో చేరాలని సూచించినప్పటికీ, తాను పార్టీ కోసం పనిచేయడానికే మొగ్గు చూపినట్లు వెల్లడించారు.

ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘వోట్ చోర్ – గద్దీ ఛోడ్’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన దూరదృష్టి ఉందని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కష్టపడుతూ ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.

హైదరాబాద్‌ను భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తోందని, డీసీసీ పదవుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ నామినేటెడ్ పదవులను ఒక నెలలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లకు సంబంధించిన అంశాలపై ఏర్పడిన వివాదాలు పూర్తిగా సద్దుమణిగాయని, ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం కూడా సంతృప్తిగా ఉందని గౌడ్ తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. తొలి క్యాబినెట్ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌లకు అవకాశం దక్కగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పదవుల కోసం పలువురు సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి మార్పులు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

#TelanganaPolitics#MaheshKumarGoud#TelanganaCabinet#CabinetReshuffle#CongressParty#RevanthReddy
#PCCPresident#BCsJustice#HyderabadDevelopment#TelanganaNews#CongressGovernment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version