Telangana
బస్సు సీట్లపై గందరగోళం.. పురుషులకు రిజర్వేషన్ ఉందా? మహిళలు ఎక్కడ కూర్చోవచ్చు?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఈ పథకానికి ఉన్న ప్రజల స్పందన గొప్పగా ఉంది. అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, దీని వల్ల కొత్త సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
బస్సుల్లో సీట్ల కేటాయింపు విషయంలో కండక్టర్లు, మహిళా ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. బస్సు వెనుక భాగంలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, అవి ‘పురుషుల సీట్లు’ అని మహిళలను నిలబెట్టడం, ఉచిత టికెట్లు కదా అని అవమానించడం వంటి ఘటనలు చర్చకు దారితీస్తున్నాయి. దీంతో మహిళలు ప్రయాణ సమయంలో అసహనానికి గురవుతున్నారు.
ఆర్టీసీ నిబంధనల ప్రకారం, బస్సుల్లో పురుషులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లు లేవు. ఆర్డినరీ బస్సుల్లో 45 సీట్లు, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 41 సీట్లు, ఎలక్ట్రిక్ బస్సుల్లో 35 సీట్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలిన 60 శాతం సీట్లలో పురుషులు, మహిళలు ఏవిధమైన అడ్డంకి లేకుండా కూర్చునే హక్కు పొందుతారు. అనేక కండక్టర్లు ఈ నిబంధనలను సరిగా గుర్తు చేసుకోకపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా మహిళలను ఇబ్బంది పెట్టడం విమర్శలకు దారితీస్తోంది.
ప్రస్తుతం డబ్బులు తీసుకునే బస్సుల్లో 70 నుంచి 75 శాతం వరకు మహిళలు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు లేవని, మహిళలకు కేటాయించిన 40 శాతం సీట్ల మినహా మిగిలిన సీట్లపై అందరికీ సమాన హక్కు ఉంది అని వారు స్పష్టం చేశారు. కండక్టర్లు మహిళా ప్రయాణికులను బలవంతంగా లేపినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని సమస్యలు ఉచిత టికెట్ల జారీతో కూడా ఉన్నాయి. ఫోటో ఉన్న ఏ ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించినా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, కొన్ని కండక్టర్లు కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపితే టికెట్లు ఇస్తారని పట్టుబడుతున్నారు. ఓటరు కార్డు చూపించినా టికెట్ నిరాకరించిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
మరి కొన్నిసార్లు, టికెట్ ఎటు తీసుకున్న గమ్యస్థానానికి ముందే దిగాలని ప్రయత్నించినప్పుడు, ఉద్యోగాలు పోతాయంటూ ప్రయాణికులను దిగనివ్వకుండా అడ్డుకోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు మహిళా ప్రయాణికుల్లో తీవ్ర మానసిక ఆందోళనను కలిగిస్తున్నాయి.
ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటే 040-69440000, 040-23450033 నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. మహాలక్ష్మి పథకం ఉద్దేశం మహిళలకు సౌకర్యం కల్పించడమేనని, క్షేత్రస్థాయిలో ఎలాంటి దుర్వినియోగానికి అవకాశమివ్వబోమని వారు స్పష్టం చేశారు.
![]()
