

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకు టికెట్ ధరలు పెంపును ఆమోదించడంపై BRS MLC దేశపతి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం టికెట్ ధరలు పెంచే అవకాశం లేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాత్రం పవన్ సినిమా అంటూ ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు. ‘‘పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ప్రత్యేక ప్రాధాన్యమా? సామాన్య సినిమా అయినా, రాజకీయ నాయకుడి సినిమా అయినా ఒకే మాపు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోంది’’ అని విమర్శించారు.
టీడీపీ, బీజేపీకి మద్దతుగా కుట్ర జరుగుతోందని ఆరోపణ
ఈ నిర్ణయం వెనక రాజకీయ ఉద్దేశాలున్నాయని దేశపతి ఆరోపించారు. ‘‘పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి ప్రధాని మోదీ వరకూ ఒకటే బంధం ఉంది. వాళ్లన్నీ కలిసి తెలంగాణలో టీడీపీ జెండా ఎగరేసేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినీ రంగాన్ని వాడుకుంటున్న ప్రభుత్వం ఈ నిర్ణయంతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. టికెట్ ధరల విషయంలో పారదర్శక విధానాన్ని అవలంబించాలని, ఓ రాజకీయ నాయకుడి సినిమా కోసం ప్రత్యేక సవరణలు చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు.