దేశంలో ఒక్కొక్కరిపై రూ.1.32 లక్షల అప్పు: కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై కీలక విషయాలను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న రుణాల ప్రభావంతో దేశంలో ప్రతి ఒక్క పౌరుడిపైనా సగటున రూ.1,32,059 అప్పు ఉన్నట్టు వెల్లడించింది. 2024 మార్చి 31 నాటికి ఈ గణాంకాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌధరి తెలియజేశారు.
GDPలో రుణ భారం తగ్గించేందుకే కృషి రుణ భారం అధికంగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకుని, దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ రుణాలను 2031 నాటికి జీడీపీలో 50 శాతానికి లోపు స్థాయికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ఈ దిశగా వ్యయ నియంత్రణ చర్యలు, ఆదాయ వృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
వడ్డీ చెల్లింపులకు భారీగా ఖర్చు దేశ రుణాలపై వడ్డీ చెల్లింపులకు సంబంధించి గణాంకాలను కూడా కేంద్రం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.9 లక్షల కోట్లు, 2023-24లో రూ.5.10 లక్షల కోట్లు, 2024-25లో రూ.5.11 లక్షల కోట్లు వడ్డీల కింద చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఇది కేంద్ర ఆర్థిక బాధ్యతలపై పెద్ద భారం వేస్తున్నట్లు తెలిపారు. వడ్డీ చెల్లింపులు మాత్రమే నిధులలో పెద్ద భాగాన్ని తీసుకుంటున్నాయనీ, దీన్ని తగ్గించేందుకు రుణ నిర్వహణ వ్యూహాలు అమలులో ఉన్నాయని తెలిపారు.