Telangana

తెలంగాణ అభివృద్ధికి దావోస్ ఊతం.. ఫ్యూచర్ సిటీలో యూఏఈ పెట్టుబడులు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF–2026) సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ముందుకు రావడం రాష్ట్రానికి భారీ విజయంగా నిలిచింది.

తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్‌లో ముఖ్యమైన సమావేశాలు జరుపుతోంది. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో జరిగిన చర్చల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి.

ఈ నగరం దాదాపు 30,000 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా మారుతోంది. ఈ నగరాన్ని ఆధునిక పట్టణ ప్రణాళికతో నిర్మిస్తున్నారు. ఇక్కడ కృత్రిమ మేధస్సు, విద్య, వైద్యం, పరిశ్రమలు, నివాస ప్రాంతాలు, వినోదం కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉంటాయి.

సీఎం వెల్లడించిన ప్రకారం మారుబేని, సెంబ్‌కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వంతారాతో కలిసి భారీ జూ పార్క్ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.

ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్ను యూఏఈ మంత్రికి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విజన్‌తో ఆకర్షితులైన యూఏఈ ప్రతినిధులు, ప్రాజెక్టు అమలును వేగవంతం చేసేందుకు ఇరు ప్రభుత్వాల అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో పాటు తెలంగాణ అగ్రి-ఎకానమీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఆసక్తి వ్యక్తమైంది. దీని ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కీలక సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దావోస్ వేదికగా తెలంగాణ సాధించిన ఈ విజయం, రాష్ట్ర అభివృద్ధి దిశలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

#TelanganaAtDavos#BharatFutureCity#NetZeroCity#SmartCityIndia#UAEPartnership#TelanganaRising2047#GlobalInvestments#WEF2026
#GreenfieldSmartCity#RevanthReddy#FutureReadyTelangana#SustainableDevelopment#AIHubIndia#EconomicGrowth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version