Latest Updates
ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ ఆగ్రహం – “50 సార్లు వెళ్లి రాష్ట్రానికి ఏమి తెచ్చావ్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 20 నెలల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 50 సార్లు వెళ్లారని, అయినా రాష్ట్రానికి ఏమి లాభం చేకూరిందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “1 నుంచి 50 వరకు” సంఖ్యలు వరుసగా పేర్కొంటూ ఒక ట్వీట్ చేశారు. అంతటి సంఖ్యలో పర్యటనలు చేసినా తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనం కలగలేదని విమర్శించారు.
కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ… రేవంత్ ఢిల్లీకి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, కాంగ్రెస్ పెద్దలకి రిపోర్టింగ్ ఇవ్వడానికే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. “నీటి హక్కులను చంద్రబాబు గారికి బహుమతిగా ఇచ్చారు. రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టి, ప్రజల సంపదను దోచుకొని ఢిల్లీ బాస్‌కి పంపిస్తున్నారు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మరోసారి రేవంత్ ప్రభుత్వంపై దాడికి దిగింది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ అధిష్ఠానానికి పని చేస్తున్నారని, ప్రజల బాధలపై పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.