Business
జీఎస్టీలో రెండు శ్లాబులకు మంత్రుల బృందం ఆమోదం
జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెద్ద మార్పుకు మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబులను (5%, 12%, 18%, 28%) కుదించి రెండు శ్లాబులుగా మార్చే ప్రతిపాదనపై చర్చ జరగ్గా, 5% మరియు 18% అనే రెండు శ్లాబులకే పరిమితం చేసే విధానాన్ని మంత్రులు ఆమోదించారు. కేంద్ర ఆర్థికశాఖ ముందుకు తెచ్చిన ఈ ప్రతిపాదనకు ఇప్పుడు జీఎస్టీ మండలి తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.
కొత్త విధానంలో 12% మరియు 28% శ్లాబులు రద్దు కానున్నాయి. దీంతో పన్ను లెక్కింపులో స్పష్టత వస్తుందని, వ్యాపార వర్గాలు కూడా ఇబ్బందులు తక్కువగా ఎదుర్కొంటారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న బహుళ శ్లాబుల కారణంగా వస్తువులపై పన్ను భారంలో తేడాలు వస్తున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు రెండు శ్లాబుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో నిత్యావసర వస్తువులు, ఆటోమొబైల్ రంగంలో ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అందరి చూపులు జీఎస్టీ మండలి తుది నిర్ణయంపైనే నిలిచాయి.