Latest Updates
కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్‌ను పేల్చే కుట్ర జరిగింది: RS ప్రవీణ్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ మరోసారి సంచలనం రేగింది. BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు 20వ పిల్లర్‌లో కనిపించిన పగుళ్లపై స్పందిస్తూ, “ఇది సహజసిద్ధంగా జరగలేదని, కచ్చితంగా కుట్రపూరితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానం కలుగుతోంద”ని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రవీణ్ మాట్లాడుతూ, “ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా, వరదలు వచ్చినా గరిష్టంగా క్రస్ట్ గేట్లకు పగుళ్లు రావచ్చు. కానీ పిల్లర్లకు మాత్రం నష్టం జరగదు. ఇళ్లలో కూడా పిల్లర్లు సేఫ్‌గానే ఉంటాయి, గోడలకే ఉష్ణోగ్రతల వల్ల పగుళ్లు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టులోని పిల్లర్లకు పగుళ్లు రావడం సహజం కాదు” అని అన్నారు.
ఈ ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రత అంశాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, ప్రజల ఆస్తి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించారు. “ప్రాజెక్టుపై ఏ విధమైన కుట్ర జరిగిందో వెలికితీసే బాధ్యత అధికారులదే” అని ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టం చేశారు.