Latest Updates
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలు: జగదీశ్ రెడ్డి
హైద్రాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులపై భారాలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. యూరియా, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కే పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అధికారుల కాళ్లు మొక్కుతూ ఎరువులు అడగాల్సిన స్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, “ఢిల్లీ కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకునే నేతలు, ఇప్పుడు ప్రజలు కూడా అలాంటి పరిస్థితిని అనుభవించాలనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. రైతులు తమ హక్కుగా అందుకోవాల్సిన ఎరువులు, సహకారం కోసం దళారుల వద్దకు వెళ్లి వేడుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ పాలన తెచ్చింది” అని ఆరోపించారు.
అలాగే కొందరు మంత్రులు, మధ్యవర్తులు కుమ్మక్కై రైతుల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన విమర్శించారు. పంటల సీజన్లో ఎరువుల కొరత సృష్టించి, దళారుల ద్వారా బ్లాక్లో అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చేశాడు. రైతుల సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కఠిన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.