Andhra Pradesh
ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఉచిత బస్సు స్కీం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ స్కీంను మొదటి దశలో “పల్లె వెలుగు” మరియు “అల్ట్రా లగ్జరీ” బస్సుల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రయాణంలో ఆర్థిక భారం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్లకూ ప్రత్యేక పథకం చేపట్టేందుకు ప్రభుత్వ యోచనలో ఉందని మంత్రి వెల్లడించారు. స్వయంగా జీవనోపాధి నడిపించుకుంటున్న ఆటో డ్రైవర్లను గౌరవిస్తూ, వారి కుటుంబాలను భరోసా ఇచ్చే విధంగా ఓ నూతన పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొకటి ప్రణాళికల్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు.