Andhra Pradesh
అసెంబ్లీలో హోంమంత్రి అనితకు అస్వస్థత: విజయవాడ ఆసుపత్రిలో చికిత్స.. ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత!

ఏపీ శాసనసభ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం సభలోనే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై జరిగిన కీలక చర్చలో పాల్గొన్న కొద్దిసేపటికే ఆమె నీరసించిపోయారు.
శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభ వాయిదా పడిన సమయంలో అనిత అసౌకర్యానికి గురయ్యారు. ప్రాథమిక తనిఖీల అనంతరం ఆమెకు రక్తపోటు (Blood Pressure) పెరిగినట్లు వైద్యులు గుర్తించారు.వెంటనే స్పందించిన వ్యక్తిగత సిబ్బంది ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.
గత వారం రోజులుగా అసెంబ్లీ సమావేశాలు, హోం శాఖ సమీక్షలతో ఆమె తీరిక లేకుండా గడుపుతున్నారు. నిరంతర పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్లే ఈ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే డిశ్చార్జ్ అయి మళ్ళీ విధుల్లో పాల్గొంటానని మంత్రి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సాయంత్రం కల్లా ఆమె ఇంటికి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.