Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో దారుణం: మూగజీవిపై అఘాయిత్యం.. నలుగురు మైనర్లు అరెస్ట్

మదనపల్లె (అన్నమయ్య జిల్లా): మానవత్వం మంటగలిసేలా, సభ్య సమాజం తలదించుకునే ఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోటలో వెలుగుచూసింది. గోమాతను పూజించే నేలపై, ఒక నోరులేని ఆవు దూడపై కొందరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
సుమారు వారం రోజుల క్రితం జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నలుగురు మైనర్ బాలురు ఒక ఆవు దూడను జనావాసాలకు దూరంగా తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలుడు దూడపై లైంగిక దాడికి పాల్పడగా, మరొకడు ఆ దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించాడు. మిగిలిన ఇద్దరు వారికి సహకరించారు.
తమ వికృత చేష్టలను అంతటితో ఆపకుండా, ఆ వీడియోను స్నేహితులకు పంపడంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ దారుణం చూసి స్థానికులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న ములకలచెరువు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నోరులేని మూగజీవుల పట్ల ఇలాంటి పైశాచిక ప్రవృత్తిని ప్రదర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ల మానసిక స్థితి ఏ స్థాయిలో దిగజారిందో ఈ ఘటన అద్దం పడుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.