Entertainment
క్రిస్ గేల్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్‌లో తనకున్న క్రేజ్, దూకుడైన ఆటతీరుతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో గడిపిన రోజుల గురించి ఓ ఇంటర్వ్యూలో గేల్ స్పష్టంగా స్పందించారు. “ఆ జట్టులో నాకు గౌరవం దక్కలేదు. ఐపీఎల్ టోర్నీకి పాపులారిటీ రావడంలో నేను కీలక పాత్ర పోషించాను. అయినా ఫ్రాంచైజీ నన్ను చిన్నపిల్లాడిలా చూసింది” అని గేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్రెషన్‌లోకి వెళ్లిన గేల్
తన కెరీర్‌లో తొలిసారి డిప్రెషన్ అనుభవించానని గేల్ చెప్పుకొచ్చారు. “నా మనసులో ఏముందో కుంబ్లేతో పంచుకున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. జట్టులో చోటు ఉన్నా సరైన గౌరవం ఇవ్వకపోవడం బాధించింది” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక, ఆ సమయంలో తాను మానసికంగా బలహీనంగా మారానని, ఇది తనకెప్పుడూ ఎదురుకాలేదని గేల్ గుర్తుచేశారు.
రాహుల్ ప్రస్తావన
అప్పటి పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తనను జట్టులో కొనసాగమని చెప్పాడని గేల్ తెలిపారు. అయినప్పటికీ తాను బ్యాగ్ సర్దుకొని జట్టును వదిలేశానని ఆయన అన్నారు. గేల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పంజాబ్ కింగ్స్‌తో గడిపిన ఆ అనుభవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని గేల్ వెల్లడించారు.