Telangana

రైతులకు బిగ్ రిలీఫ్: తెలంగాణలో 9 లక్షల మందికి మేలు చేసే నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అడ్డంకిగా మారిన కఠిన నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా విక్రయదారుడి అఫిడవిట్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనల వల్ల సుమారు 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. దశాబ్దాల క్రితం భూములు కొన్న వారు ఇప్పుడు పాత యజమానుల సంతకాల కోసం వెతుక్కుంటున్నారు. భూమి ధరలు చాలా పెరిగాయి. పాత యజమానులు సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. బేరసారాలు చేస్తున్నారు. రైతులు, కొనుగోలుదారులు చాలా నష్టపోయారు.

ఈ పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం, ఇకపై కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉందన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తహశీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది నేరుగా స్థల పరిశీలన చేసి, కొనుగోలుదారు ఎంతకాలంగా భూమిని సాగు చేస్తున్నాడు, ఇరుగుపొరుగు రైతుల వాంగ్మూలం ఏమిటి అనే విషయాలపై పంచనామా నిర్వహిస్తారు.

స్థానిక రైతుల సాక్ష్యాలు మరియు పొషెషన్ ఆధారంగా నిజమైన లావాదేవీగా తేలితే, విక్రయదారుడి అఫిడవిట్ లేకుండానే సాదా బైనామా క్రమబద్ధీకరణ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. భూభారతి చట్టం భూ వివాదాల తగ్గింపు మరియు సామాన్యులకు న్యాయం అనే లక్ష్యాన్ని సాధించడానికి ఈ మార్పులు తీసుకువస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

రెవెన్యూ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి, “ఇన్నేళ్ల తర్వాత పాత యజమాని సంతకం ఆశించడం అన్యాయం” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. న్యాయశాఖ అనుమతి కూడా లభించడంతో, ఒకటి రెండు రోజుల్లో సవరించిన మార్గదర్శకాలతో కొత్త జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో లక్షలాది కుటుంబాలకు ఊరట కలగనుంది.

#SaadaBainaama#LandRegularization#TelanganaGovernment#RevanthReddy#LandReforms#RevenueReforms#FarmerRelief#PublicRelief
#PropertyRights#LandIssues#PendingApplications#AffidavitRuleRemoved#TelanganaNews#LandDisputes#GovernmentDecision

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version