Andhra Pradesh

విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ..

తెలుగు రాష్ట్రాల్లో కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ చాలా ఫేమస్.. కాకినాడలో ప్రస్థానం మొదలుకాగా.. రెండు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ప్రారంభించే స్థాయికి ఎదిగారు. అయితే విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. భోజనంలో జెర్రి రావడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విజయవాడలోని సుబ్బయ్యగారి హోటల్‌కు వచ్చిన ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ చేయగా.. అక్కడి సిబ్బంది ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ భోజానాన్ని చూడగా.. అందులో జెర్రి వచ్చింది. దీంతో కస్టమర్ అవాక్కయ్యారు. హోటల్ సిబ్బందిని పిలిచి ఈ విషయాన్ని చెప్పారు.

భోజనం జెర్రి బయటపడిన సమయంలోనే.. అదే హోటల్‌లో కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ (NHRC) ఇంఛార్జ్‌ ఛైర్మన్ విజయభారతి సయానీ భోజనం చేస్తున్నారు. వెంటనే ఆమె స్పందించి.. సుబ్బయ్యగారి హోటల్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఈ వ్యవహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. హోటల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్ అధికారులు ఆ హోటల్‌ను పరిశీలించి సీజ్ చేశారు. అక్కడ ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. దీంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

ఇటీవల కొంతకాలంగా కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలో ఆహారం లో జెర్రి, పురుగులు కనిపించిన సంఘటనలు చాలానే జరిగాయి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరుగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నప్పటికీ, కొందరు మాత్రం తమ పద్ధతిని మార్చడం లేదు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లలో కిచెన్‌లు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అలాగే, ఆహారంలో కల్తీ ఆయిల్, రంగు, పాత చికెన్‌ను కూడా కనిపెట్టారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లకు జరిమానాలు విధించగా, మరికొన్ని సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లలో జరిగేవి కావడంతో, ప్రజలు బయటకు వెళ్లి ఆహారం తినడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version