Latest Updates

అమెరికా కీలక నిర్ణయం.. ప్రత్యేక విమానంలో భారతీయులు వెనక్కి..

అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అక్రమ వలసల నియంత్రణకు ప్రయత్నిస్తోన్న యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌).. పలు దేశాలకు చెందిన వారిని వెనక్కి పంపుతోంది. ఇందులో భాగంగా, తమ దేశంలో అక్రమంగా ఉన్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్‌ఎస్‌ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీరిని పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ చర్యలు చేస్తున్నామని చెప్పారు. ‘చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం.. వలస వచ్చిన విదేశీయులు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని డీహెచ్ఎస్‌ సీనియర్‌ అధికారి క్రిస్టీ ఎ.కనెగాల్లో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గత జూన్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గాయని డీహెచ్‌ఎస్ చెప్పింది. ఈ క్రమంలో 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపించినట్లు తెలిపింది. 495కి పైగా ప్రత్యేక విమానాల్లో 145 దేశాలకు చెందిన పౌరులను వెనక్కి పంపించామని చెప్పింది. వీరిలో భారతదేశం, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్థాన్, చైనా దేశాల పౌరులు ఉన్నారు.

ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నిరోధించడంతో పాటు చట్టబద్ధమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకేనని అమెరికా స్పష్టం చేసింది. చట్టబద్ధమైన అనుమతి లేకుండా అమెరికాలో ఉన్న వారి పౌరులను స్వదేశానికి తీసుకెళ్లేలా ఆయా విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.

అగ్రరాజ్యంగా చలామణి అవుతోన్న అమెరికా అభివృద్ధి చెందిన దేశం కావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ఉద్యోగాలను వెతుక్కూంటూ ప్రపంచ దేశాల్లోని ప్రజలు అమెరికాలో అడుగుపెడతారు. అక్కడే స్థిరపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అమెరికాలోకి ఏటా ఎంత మందిని అనుమతించాలి అనేది అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒక్కో దేశానికి సంవత్సరానికి కొన్ని వర్కింగ్ వీసాలు మంజూరు చేస్తుంది. కానీ, చాలా మంది వీసాలు లేకుండా అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్నారు.

ఇలాంటి వారు అధికారులకు చిక్కితే, జైలులో జీవితం గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలస దారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. మనకంటే ముందు మెక్సికో, ఎల్‌సాల్విడార్ ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసలు ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా ఉన్నాయి.ఈసారి కూడా ఇదే అంశంపై డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ తమ విధానాలను ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version