Latest Updates

దీపావళి పండగకు ముందు ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త..

Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్రమంత్రి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (DA) పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ, 53 శాతానికి పెరిగింది. కేంద్రం ఏటా రెండు సార్లు డీఏ పెంచుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో 4 శాతం పెంచగా, ఇప్పుడు మరో 3 శాతం పెంచారు.

దీపావళి పండగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. సర్కార్ శుభవార్త అందించింది.కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేసిన పెన్షనర్లకు డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) 3 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు వారి బేసిక్ సాలరీలో ఈ డీఏ పెంపు ఉంటుంది. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్‌ వేతనం అందుకుంటున్న ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. అదనంగా రూ.540 అందుకుంటారని తెలుస్తోంది.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)లో మార్పులు చేస్తూ ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 1.16 కోట్ల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి.. దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో రెండోసారి కేంద్రం ప్రకటిస్తుంది.

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం డీఏ పెంపు

ఇక ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి రాగా.. తాజాగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం గుడ్‌న్యూస్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను 4 శాతం పెంచుతున్నామని.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 3.9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ డీఏ పెంపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు కానున్నట్లు సీఎం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version