Andhra Pradesh

తిరుమలలో ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు..

టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించి, దాని శిథిలావస్థను గుర్తించారు. ఆ తర్వాత, స్థానిక దుకాణాల్లోని లైసెన్సులను స్వయంగా తనిఖీ చేసి, ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలు తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా, భవనంపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

అలాగే, ఒకే లైసెన్సుతో రెండు లేదా మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినందున, లైసెన్సుల డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించి, దుర్వినియోగం నివారించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో అనధికారిక వ్యాపారాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. అలాగే, అధిక ధరలలో వస్తువులు విక్రయించే వ్యాపారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఎలక్ట్రికల్ డిఈ ఎన్ చంద్ర శేఖర్, వీజీవో సురేంద్ర, రెవెన్యూ ఏఈవో నారాయణ చౌదరి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనమునకు వచ్చారు. బుధవారం వీఐపీ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని, అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని అభినందిస్తూ, తిరుమలలో అన్యమత ఉద్యోగుల బదిలీ నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించారు.

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో, శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) కొనసాగుతోంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా, నవంబర్ 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహించబడుతుంది. ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించబడినట్లు తెలిపింది. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతీ, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన మరియు హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version