Latest Updates

ఇక నుంచి ఆ వస్తువులు తేవద్దన్న శబరిమల బోర్డు అయ్యప్ప భక్తులకు అలర్ట్..

ఇక నుంచి ఆ వస్తువులు తేవద్దన్న శబరిమల బోర్డు అయ్యప్ప భక్తులకు అలర్ట్..

కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ముఖ్యమైన సూచనలు చేసింది. ఇకపై శబరిమల కు వచ్చే అయ్యప్ప స్వాములు ఇరుముడిలో అవసరం లేని వస్తువులను తీసుకురావద్దని కోరింది. దీని గురించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపింది. ఈ క్రమంలో, కేరళలోని ఆలయ పాలక మండళ్లు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖలు పంపించాలని నిర్ణయించింది. ఇరుముడులపై ఈ నిర్ణయం ఎందుకంటే?

అయ్యప్ప స్వాములకు ఇరుముడి చాలా పవిత్రమైంది. అందుకే దాన్ని తలపై కట్టుకుని.. శబరిమల కొండ ఎక్కిన తర్వాత పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఇలాంటి పవిత్రమైన ఇరుముడులకు సంబంధించి ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ప్రయాణించే అయ్యప్ప స్వాములకు చెందిన ఇరుముడులను తమతోపాటే విమానంలో పట్టుకుని ప్రయాణించే వీలు ఉందని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరుముడులకు సంబంధించి తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడిలో అనవసర వస్తువులను నింపుకుని.. వాటిని కొండపైకి తీసుకురావద్దని సూచించింది.

సాధారణంగా ఇరుముడికట్టులో తీసుకువచ్చే కర్పూరం, అగరుబత్తీలు, రోజ్ వాటర్‌ను శబరిమలకు తీసుకురావొద్దని ట్రావెన్‌కోర్ బోర్డు తెలిపింది. త్వరలోనే ఈ విషయంపై సర్య్కులర్ జారీ చేయనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు. అంతేకాకుండా కొచ్చి, మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయాల పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఇరుముడిలో తీసుకువచ్చే కర్పూరం, అగరు బత్తీలు పూజా సామగ్రి అయినప్పటికీ.. వాటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప సన్నిదానంలో అగరు బత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదని తెలిపింది. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయని గుర్తించింది. ఈ క్రమంలోనే వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకే ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఆలయ ప్రధాన పాలకుడు (తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరు బత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వామ్ బోర్డుకు లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన నేపథ్యంలోనే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భక్తులు కాలినడకన శబరిమలకు వచ్చినపుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారని.. కానీ ఇప్పుడు అన్ని చోట్లా ఆహారం దొరుకుతోందని.. అందుకే ఇరుముడికట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం మాత్రమే తెచ్చుకుంటే వాటిని శబరిమలలో సమర్పించవచ్చని లేఖలో పేర్కొన్నారు.

నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్ గురించి ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు మరోసారి ప్రకటించింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా నేరుగా శబరిమలకు వచ్చే భక్తుల కోసం పంబ, ఎరుమేలి, సత్రంలో స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ చేసుకునే భక్తులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని తెలిపింది. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ఒక ప్రత్యేక పాస్ ఇవ్వాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసిన యాత్రికుల సమాచారం తెలుసుకోవడానికి ఈ పాస్ ఉపయోగపడుతుంది. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను తయారు చేస్తామని దేవస్థానం బోర్డు చెప్పింది. స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పను రోజుకు 10 వేల మంది దర్శించుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజూ 70 వేల మంది దర్శించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version