Telangana

Telangana Weather: తెలంగాణ చలితో వణికిపోతోంది… ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి., ఈ జాగ్రత్తలు తీసుకోండి

Telangana Weather: తెలంగాణ చలితో వణికిపోతోంది.. ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి., ఈ జాగ్రత్తలు తీసుకోండి

తెలంగాణలో చలి గాలి ప్రభావం ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నాయి. చలి ప్రభావం పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

తెలంగాణలో చలి మరింత తీవ్రంగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కనిష్ఠ స్థాయిలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల సెల్సియస్, అసిఫాబాద్ సిర్పూర్‌లో 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో చలి తీవ్రంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా తగ్గాయి. చీకటి పడిన వెంటనే నగరవాసులు చలితో వణికిపోతున్నారు. నగర శివార్లలో చలి ఇంకా ఎక్కువగా ఉంది. ఉదయం సూర్యుడు రాకముందు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. పొగ మంచు అధికంగా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు దిగువన పడిపోతున్నాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

ఈనెల 26 లేదా 27న బంగాఖాతంలో అల్పపీడనం ఏర్పడతారని, అప్పటి వరకు తెలంగాణలో పొడిగా వాతావరణం ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే అవకాశముంది. నేడు హైదరాబాద్‌ నగరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా, రాత్రిపూట 15 డిగ్రీలకు దిగువకు పడిపోతాయని చెప్పారు. చలి పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింత మహిళలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలితో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వేడి ఆహారం మాత్రమే తినాలని, చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. శరీరాన్ని పూర్తిగా కప్పే ఉన్ని దుస్తులు ధరించాలని చెప్పారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని సూచించారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండవచ్చు, కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version