Telangana

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో చావటానికైనా సిద్ధం..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో చావటానికైనా సిద్ధం..

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే, తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. పేదల కోసం చావడానికైనా సిద్ధమేనని చెప్పారు.  మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని ప్రచారం చేయడం హాస్యంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన కూడా కొనసాగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అవే అబద్ధాలు, అరాచకాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని కిషన్ రెడ్డి విమర్శించారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ తెలంగాణలో గెలిచిందన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుల డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో పోలీసు నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్లే వికారాబాద్‌లో కలెక్టర్‌పై గ్రామస్థులు దాడి చేశారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఏకైక ఏటీఎమ్‌గా తెలంగాణ మారిందన్నారు. మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చిన కిషన్ రెడ్డి.. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధి కార్యచరణే లేదని మండిపడ్డ కిషన్ రెడ్డి.. హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చేస్తూ.. నల్గొండలో రైతులను రెచ్చగొడుతుండటం తప్ప వాళ్లు చేసేదేమీ లేదని రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చమని, బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. పేదల కోసం చావటానికి కూడా సిద్ధమేనని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, రేపు పేదల ఇళ్లలో, మూసీ పక్కన నిద్రిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే, దానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటుందనే విషయం పూర్తిగా అబద్ధం అని కిషన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు.. వనవాసి, గ్రామవాసి, నగరవాసి సమ్మేళనంతో లోక్ మంథన్ -2024 నిర్వహించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో హైదరాబాద్ నగరవాసులతో పాటు, తెలంగాణ ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. ముఖ్యంగా యువత, పిల్లలు, స్థానికంగా ఉండే సాప్ట్ వేర్ ఉద్యోగులు నాలుగు రోజుల పాటు జరిగే మంథన్‌లో భాగస్వామ్యమై దేశ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version