Telangana

31 ఎకరాల్లో కొత్త దవాఖాన ఉస్మానియా ఆస్పత్రికి మోక్షం…కీలక ముందడుగు

31 ఎకరాల్లో కొత్త దవాఖాన ఉస్మానియా ఆస్పత్రికి మోక్షం…కీలక ముందడుగు

హైదరాబాద్‌లో ఉన్న పురాతన ఆస్పత్రిల్లో ఒక్కటైన ఉస్మానియా దవాఖానా.. ఇప్పటికి కూడా నిరుపేదలకు సేవలందిస్తోంది. అయితే.. ఏళ్ల నాటి భవనం కావటంతో శిథిలావస్థకు చేరుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి అని చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఆ పని ప్రారంభం కాలేదు. అయితే, ఈరోజు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఉస్మానియా ఆస్పత్రి భవనం చాలా పురాతనది కాగా, అది శిథిలావస్థకు చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం. కానీ, గత ప్రభుత్వంలో ఉస్మానియా ఆస్పత్రిని తరలించవలసినది మరియు కొత్త ఆస్పత్రి భవనం నిర్మించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అది అమలవలేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం కోసం కసరత్తు జరుగుతోంది. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం 31 ఎకరాల్లో నిర్మించడానికి ప్రణాళికలు తీసుకోవడం జరుగుతోంది. ఈ విషయంపై బల్దియా యంత్రాంగం దృష్టి పెట్టింది.

బుధవారం (నవంబర్ 28న), జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఆరో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 అంశాలు మరియు ఒక టేబుల్ ఐటమ్ కి సభ్యులు ఆమోదం ఇచ్చారు. ఈ సమావేశంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం గురించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లి పోలీస్ క్వార్టర్స్, గోషామహల్ బంక్, స్టేడియం, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ కోర్టులు ఉన్న 31.39 ఎకరాల భూమిలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్ఓసీ (అనుమతి) జారీ చేయడానికి ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది.

వీటితో పాటు డివిజన్ స్థాయిలో క్రీడా పోటీలు, ఇతర క్రీడా కార్యక్రమాలు నిర్వహించేలా ఒక్కో కార్పొరేటర్కు రూ.2 లక్షల విలువైన క్రీడా సామగ్రిని అందించే అంశాన్ని స్టాండిగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. నాగమయ్యకుంట నాలా పొడిగింపులో భాగంగా బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3 కోట్ల పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. హబీబ్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్, రియాసత్ నగర్ నుంచి హబీబ్ నగర్ వయా పాపాలాల్ టెంపుల్ వరకు రోడ్డు డెవలప్మెంట్కు 174 ఆస్తులు సేకరించాలని నిర్ణయించింది.

నిరుద్యోగ యువతకు, మహిళలకు సీఎస్ఆర్ కింద లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీహుడ్ ప్రోగ్రాం నిర్వహించడానికి, ఏడాది పాటు మల్లేపల్లి మోడల్ మార్కెట్ భవనాన్ని స్వాధీనం చేసేందుకు అనుమతిస్తూ సంబంధిత ఏజెన్సీతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేయడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను, సికింద్రాబాద్ జోన్‌లో కంప్యూటర్ ఆపరేటర్ అదనపు పోస్టు మంజూరు చేయడాన్ని ఆమోదించారు. ఇవి కాకుండా, కార్పొరేటర్ల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ను మరో ఏడాది పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్టాండింగ్ కమిటీ సభ్యులు, మరియు అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version