Telangana

Warangal: ములుగు అడవిలో బీభత్సానికి కారణమిదే..

ములుగు జిల్లాలో మేడారం అడవుల్లో ఆగస్టు 31న టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగి 60 వేల చెట్లు కూలిపోయిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ వృక్షాలు వేర్లతో సహా పెకిలించుకొని కూలిపోగా.. కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అడవిలో గీత గీసినట్లుగా ఒక నిర్దేశిత ప్రాంతంలో ఈ విధ్వంసం జరిగింది. మేడారం, తాడ్వాయి, పస్రా అటవీ ప్రాంతాల్లోని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. తమ కెరీర్‌లోనే ఇలాంటి ఘటన చూడలేదని సీనియర్ ఫారెస్టు అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిపుణులతో ఈ ఘటనకు గల కారణాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. నాటి విధ్వంసానికి గల కారణంపై ఒక అభిప్రాయానికి వచ్చారు. రెండు వైపుల నుంచి వీచిన బలమైన గాలులకు తోడు కుండపోత వర్షం కారణంగా విధ్వంసం జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ములుగు అడవిలో బీభత్సానికి కారణాలు:
✦ బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఒకేసారి వాయుగుండాలు ఏర్పడ్డాయి. రెండు వైపుల నుంచి గంటకు 130 – 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి.
✦ రెండు వైపుల నుంచి వీచిన ఈ బలమైన ఈదురుగాలులు మేడారం అటవీ ప్రాంతంలో ఎదురెదురుపడ్డాయి.
✦ దీంతో అటవీ ప్రాంతంలో టోర్నడో తరహా సుడిగాలి చెలరేగి చెట్లను వేర్లతో పాటు పెకిలించివేసి నేలకూల్చింది.
✦ ఇదే సమయంలో ఈ ప్రాంతంలో బలమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసింది. దీంతో వేల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.
✦ ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న నేల అత్యంత సారవంతమైనది. అడవిలో రాలిన ఆకులు ఇతర లవణాలతో కలిసి ఎరువుగా మారుతున్నాయి. లవణాలు సమృద్ధిగా లభించడంతో వేర్లు భూమిలోకి లోతుగా వెళ్లకుండానే చెట్లు త్వరగా పెరుగుతున్నాయి. వేర్లు భూమిలోకి నిలువుగా కాకుండా అడ్డంగా పోవడం వల్ల.. గాలి దుమారానికి పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి.

అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం (సెప్టెంబర్ 24) హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC), నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (NARL), ఇండియా మెటియోరోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (IMD) శాస్త్రవేత్తలు, ఎన్‌ఐటీ వరంగల్, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు పాల్గొన్నారు.

ఘటన జరిగిన అనంతరం అడవిలో సందర్శించిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం డోబ్రియాల్‌.. నాడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఘటన జరిగిన రోజు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని శాటిలైట్ చిత్రాలను పరిశీలించడం ద్వారా అంచనా వేశారు.

అడవిలో దాదాపు 332 హెక్టార్లలో 30 వేల చెట్లు కూకటివేర్లతో పాటు కూలిపోయాయని, మరో 25 వేలకు పైగా చెట్లు విరిగిపోయాయని ములుగు డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ తెలిపారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్న సైంటిస్టులకు, నిపుణులకు వివరించారు.

చెట్లు కూలిపోయిన అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆర్‌ఎం డోబ్రియాల్‌ ఆదేశించారు. ఈ వర్క్ షాప్‌కు కొంత మంది నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. ఈ ఘటన నివాస ప్రాంతాల్లో జరిగి ఉంటే పరిస్థితి ఏంటనేది – ఇప్పుడు స్థానికులు లేవనెత్తుతున్న మరో ప్రశ్న..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version