Telangana

తెలంగాణ ప్రజలకు పండగలాంటి శుభవార్త.. తెలంగాణ సదర్ సమ్మేళనం..

సంచలన నిర్ణయాల పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో యాదవులకు రేవంత్ రెడ్డి సర్కార్ పండుగలాంటి శుభవార్త వినిపించింది. ఏటా యాదవులు అట్టహాసంగా జరుపుకునే.. సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. దాంతో శనివారం (అంటే నవంబర్ 02) రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసారు . సదర్ సమ్మేళనాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా.. ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

అయితే.. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత.. హైదరాబాద్‌లో యాదవ సోదరులు.. సదర్ సమ్మేళనం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. పెద్ద పెద్ద దున్నలు ఈ సదర్ సమ్మేళనంలో సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే.. ఈసారి కూడా సదర్ ఉత్సవాలను కోలాహలంగా నిర్వహించేందుకు యాదవులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఈరోజు సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈరోజు నిర్వహించనున్న సదర్ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని చాల ప్రాంతాల నుంచి పేరు పొందిన దున్నరాజులు ఇప్పటికే నగరానికి వచ్చేసాయి. హర్యానాకు చెందిన ఏడడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుతో ఉండే “గోలు 2” అనే ముర్రా జాతి దున్నపోతు అందరి దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అయింది. తెలుగు రాష్ట్రాల్లోని దున్నరాజులు కూడా ఈ సదర్‌ ఉత్సవాల్లో తమ రాజసాన్ని చూపేందుకు రంగంలోకి దిగుతున్నారు. గతంలో బాహుబతి దున్నలు హైదరాబాద్‌లో కనువిందు చేశారు.

ఇక సదర్ సమ్మేళనం దృష్ట్యా.. హైదరాబాద్ పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ కి సంబంధించి ఆంక్షలు విధించారు. ముఖ్యంగా.. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఆంక్షలు విధించారు. శనివారం (నవంబర్ 02) రాత్రి 7 గంటల నుంచి ఆదివారం (నవంబర్ 03) తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణాలు చేసే వాహనదారులు.. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని నగర పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version