Telangana

తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళం..

ఈ నెల మొదటి వారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలకు ప్రాణనష్టంతో పాటుగా భారీగా ఆస్తి, పంట నష్టం కూడా వాటిల్లింది. వరదల కారణంగా ఎందరో నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతోనే మిగిలారు. ఇలాంటి వారికి పలువురు దాతలు అండగా నిలబడి.. తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన ప్రజలకు రంగాలకు అతీతంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలు విరాళాలు అందిస్తున్నాయి.

వరద బాధితులకు అండగా సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో అందజేస్తున్నారు. తెలంగాణలో వరద బాధితుల కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భూరి విరాళం అందజేసింది. సీఎం సహాయనిధికి రూ.20 కోట్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో నీతా అంబానీ తరపున చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారం అందించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పీవీఎల్ మాధవరావులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సంస్థ తరపున విరాళంగా రూ.20 కోట్లు చెక్కును సీఎం రేవంత్‌కు అందజేశారు. దీంతో వారికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఎవరూ విరాళాన్ని ఇవ్వలేదు.

టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాంచరణ్ సహా పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు పలు ప్రయివేట్ సంస్థలు విరాళాలను అందజేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల సైతం తమ ఒక్క రోజు వేతనాన్ని వరద బాధితుల కోసం వదులుకున్నాయి. స్టేట్ బ్యాంకు ఉద్యోగుల సంఘం కూడా రూ.5 కోట్ల విరాళంగా అందజేసింది. విశాఖ టీడీపీ ఎంపీ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్.. తమ గీతం విద్యా సంస్థల తరఫున రూ.కోటి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version