Politics

CM గా ఆతిశీ ప్రమాణం.. ఢిల్లీ యంగెస్ట్ సీఎంగా రికార్డ్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అత్యంత చిన్న వయసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆతిశీ రికార్డ్ సృష్టించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.. ఆతిశీతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి ఆతిశీతోపాటు మరో ఐదుగురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.

43 ఏళ్ల ఆతిశీ.. కేజ్రీవాల్ కేబినెట్‌లో కీలకమైన 13 శాఖలను నిర్వహించారు. మరోవైపు.. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున బలంగా ప్రతిపక్షాలను ఎదుర్కొవడంలో దిట్ట అయిన ఆతిశీకే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆతిశీ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. ఆతిశీ తల్లి తృప్తి వాహి, తండ్రి విజయ్ సింగ్.. రాజ్ నివాస్‌కు చేరుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు.

మరోవైపు.. ఆతిశీతోపాటు మరో ఐదుగురితో కూడా ఎల్జీ వీకే సక్సేనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్‌లు ఉన్నారు. వీరిలో సుల్తాన్‌పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎన్నికైన ముఖేష్ అహ్లావత్‌కు కూడా ఆతిశీ మంత్రివర్గంలో చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎం పదవి ఎవరికీ కేటాయించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఆతిశీ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని ఆప్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక ఆతిశీ ఢిల్లీ 8వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. మూడో మహిళా ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆతిశీ కంటే ముందు దివంగత ముఖ్యమంత్రులు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్‌లు ఢిల్లీ సీఎంలుగా పనిచేశారు. ఇక అందరిలో కెల్లా అతి పిన్న వయస్సులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సీఎంగా ఆతిశీ రికార్డుల్లోకి ఎక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version