Latest Updates

కేరళలోని ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు

దీపావళి పండుగ సందర్బంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేలుళ్ల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, కేరళలోని కాసర్‌గఢ్‌లో భారీ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి నీలేశ్వరం వీరకావు ఆలయం వద్ద వేడుకలు జరుగుతుండగా సమీపాన ఉండే బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 150 మంది గాయపడగా.. వీరిలో అనేక మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అలానే తీవ్రంగా గాయపడిన 8 మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వేడుకను పురస్కరించుకున్న భక్తులు ఎక్కువుగా గుమ్మి గూడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ముందుగా బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగి.. కొద్ది సమయంలోనే ఆలయ ఉత్సవ వేదిక వరకు వ్యాపించాయి.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలు అదుపుచేసి.. క్షతగాత్రులను చికిత్స కోసం కాసర్‌గఢ్, మంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఆలయానికి దగ్గరలోనే బాణా సంచా దుకాణం ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాసర్‌గడ్ జిల్లా ఆసుపత్రిలో 31 మంది, ప్రయివేట్ ఆసుపత్రుల్లో మరో 71 మందికి చికిత్స జరుగుతుంది. మరికొందర్ని సమీపంలోని మంగళూరుకు తరలించారు. నీలేశ్వర్ ఆసుపత్రిలో 11 మంది, కన్నూర్ కిమ్స్‌లో 5 మందికి చికిత్స కొనసాగుతోంది. మిగతావారిని మంగళూరు, కన్నూరు పెరియారమ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

కాగా, వీరకావు ఆలయంలో జరుగుతోన్న థెయ్యమ్ ఉత్సవానికి మహిళలు, చిన్నారులతో సహా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. డప్పులు, వాయిద్యాలతో ఉత్సవం సాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఊహించని విధంగా పేలుడు చోటుచేసుకుంది. పేలుడు సమయంలో రికార్డయిన వీడియోలు భయంకరంగా ఉన్నాయి. థెయ్యమ్ ఉత్సవంలో మునిగిపోయిన భక్తులు.. ఆ పక్కనే చిన్నగా మొదలైన బాణాసంచా పేలుడును తొలుత గమనించారు. తర్వాత కొద్ది సేపటికే భారీ శబ్దంతో విస్పోటనం జరిగి.. పైకప్పు ఎగిరిపడింది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోనూ వరుసగా రెండు బాణాసంచా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలానే ఆదివారం రాత్రి అబిడ్స్ వద్ద బాణాసంచా దుకాణంలో పేలుడు జరిగి ఇద్దరు మహిళలు మరణించారు. ఇక, యాకుత్‌పురాలో టపాసులు పేలి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. టపాసుల వ్యాపారం చేసే ఈ కుటుంబం సోమవారం రాత్రి నిద్రలో ఉండగా ప్రమాదం జరిగింది. పండుగ కోసం పిండివంటలు చేసి.. సిలిండర్ ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగి పేలుడు సంభవించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version