Latest Updates

ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. సల్మాన్ ఖాన్‌కు దూరంగా ఉండు..

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు లారెన్స్ బిష్ణోయ్. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు చాలా మారుమ్రోగుతోంది. సల్మాన్ ఖాన్‌ను నేరుగా బెదిరిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్, ఆయనకు దగ్గరగా ఉండే వారిని టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ను కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది. సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పప్పూ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌కు వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. తమ హెచ్చరికలను పట్టించుకోకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా, పప్పూ యాదవ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పడం సంచలనం కలిగిస్తోంది. గంటకు రూ. లక్ష చెల్లించి లారెన్స్ బిష్ణోయ్ జైల్లో సిగ్నల్ జామర్లను ఆపిస్తున్నాడని, తర్వాత పప్పూ యాదవ్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని బెదిరింపులు చేసిన వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ బెదిరింపు కాల్స్‌ను పప్పూ యాదవ్ పట్టించుకోలేదని సమాచారం.

“వీలైనంత త్వరగా భాయ్‌తో సెటిల్‌మెంట్‌ చేసుకోండి. మిమ్మల్ని పెద్దన్నయ్యలా భావించా. కానీ మీరు ఇబ్బంది పెట్టారు. తిరిగి కాల్ చేస్తే, ‘మీకు భాయ్‌తో కనెక్ట్ చేస్తా’ అని ఒక రికార్డు చేసిన ఆడియో మెసేజ్ వచ్చింది. ఈ ఆడియో రికార్డింగ్‌పై పప్పూ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు బెదిరింపులు రావడంతో సెక్యూరిటీని మరింత పెంచాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల బాబా సిద్దిఖీ హత్య తామే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంపై స్పందించిన పప్పూ యాదవ్.. వారికి ఓపెన్‌గా సవాల్ చేశారు. తనకు అనుమతి ఇస్తే, 24 గంటల్లోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఆపుతానని అన్నారు. ఈ సందర్భంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ బిడ్డ అయిన బాబా సిద్దిఖీ.. హత్య అత్యంత విషాదకరమని.. ఇలాంటి ప్రముఖ వ్యక్తులనే బీజేపీ ప్రభుత్వం కాపాడలేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని పప్పూ యాదవ్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version