Latest Updates

‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ రాజ్యాంగంలో పదాలు తొలగించండి..

‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ రాజ్యాంగంలో పదాలు తొలగించండి.. కోర్టులో అటార్నీ జనరల్ ప్రతిపాదన

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్.. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రతిపాదించడం సంచలనంగా మారింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్ధులు చేపట్టిన ఉద్యమం.. ఏకంగా హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసింది. అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ చెల్లుబాటు తేల్చాలని రిట్ పిటిషన్ దాఖలైంది. రాజ్యాంగేతర మార్గాల ద్వారా పాలనలో మార్పు తీసుకొస్తే మరణశిక్ష విధించే నిబంధనతో పాటు, రాజ్యాంగం నుంచి ‘సెక్యులరిజం’ మరియు ‘సోషలిజం’ అనే పదాలను తీసేయాలని బంగ్లాదేశ్‌లో ఒక ఉన్నతస్థాయి న్యాయ అధికారి ప్రతిపాదించారు.

పౌరుల బృందం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం నాటి విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ మహ్మద్ అసదుజ్జామాన్.. రాజ్యాంగంలోని నాలుగు సూత్రాలలో రెండు ‘లౌకికవాదం’ ‘సామ్యవాదం’ అనే పదాలతో పాటు జాతిపితగా షేక్ ముజిబుర్ రెహమాన్‌ పేరును తొలగించాలని ఆయన కోరారు.

షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్‌లో తిరుగులేని నాయకుడు.. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అవామీ లీగ్ ఆయన పేరును వాడుకుంటోంది’ అని అన్నారు.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడైన ఆయన బంగాబంధు అని కొనియాడారు. దేశ బహిష్కరణకు గురైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ హయాంలో చేసిన 15వ రాజ్యాంగం సవరణ చెల్లుబాటును సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు.. ఈ విషయంలో మధ్యంతర ప్రభుత్వం తన వైఖరితో ముందుకు రావాలని నోటీసులు జారీచేసింది.

కోర్టు వెలుపల అటార్నీ జనరల్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ‘మొత్తంగా ఆ (హైకోర్టు) నిబంధనను రద్దు చేయాలని మేము కోరుకోవడం లేదు’ రిట్ పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. కోర్టు విచారణ సమయంలో 15వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 7ఏను అటార్నీ జనరల్ తీవ్రంగా విమర్శించారు. ఇక, చాలా మంది మంది లాయర్లు.. ఈ రిట్ పిటిషన్‌లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే, కొందరు ఈ అభ్యర్ధనను సమర్థించగా.. ఇంకొందరు వ్యతిరేకించారు.

రాజ్యాంగంలోని అనేక నిబంధనలు పునరుద్ధరణ, రద్దు, కొత్తవి నిబంధనలు చేర్చడానికి నాటి అవామీ లీగ్ ప్రభుత్వం 15వ సవరణను పూర్తి మెజార్టీతో పార్లమెంటు ఆమోదించింది. ఈ సవరణలలో లౌకికవాదాన్ని రాజ్య సూత్రంగా పునరుద్ధరణ, ఎన్నికల పర్యవేక్షణ కోసం ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను రద్దు, రాజ్యాంగేతర మార్గాల ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టడం, షేక్ ముజిబుర్ రెహమాన్‌ను జాతిపితగా పేర్కొనడం వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఆపద్ధర్మ ప్రభుత్వ వ్యవస్థను పునరుద్ధరించాలని, రాజ్యాంగంలో ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేయాలని తాజాగా డిమాండ్ చేశారు.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం బంగ్లాదేశ్‌లో పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. అల్లర్లతో దేశం కలతచెందింది. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, కట్టుబట్టలతో భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోగా, మూడు రోజుల తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version